రాట్నాలమ్మ క్షేత్రం

శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని వివిధ ప్రాంతాల్లో అనేక రూపాల్లో అవతరించింది. అమ్మ ఏ రూపాన్ని ధరించినా ఆమెకి తన బిడ్డలను కాపాడటం కన్నా ఆనందమేముంటుంది. అలా తన బిడ్డలైన భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మ 'రత్నాలమ్మ'గా మరో రూపాన్ని ధరించింది. భక్తుల పాలిట చల్లనితల్లిగా పూజలందుకుంటోన్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా లోని ఏలూరు సమీపంలో అలరారుతోంది.

తన భక్తులను రత్నాలమ్మ ఎలా కంటికి రెప్పలా కాపాడుతుందనేది స్థల పురాణమే చెబుతుంది. పూర్వం తూర్పు చాళుక్యులు తమ ఇలవేల్పుగా శక్తి స్వరూపిణిని పూజిస్తూ వుండేవారు. చాళుక్య ప్రభువుల ఖజానాలో అనంతమైన సంపదలు ఉండేవి. ఈ కారణంగానే ఈ అమ్మవారిని వాళ్లు రత్నాలతో పూజించే వారు. అందువల్లనే ఈ తల్లికి 'రత్నాలమ్మ' అనే పేరు వచ్చింది.

ఒకసారి కొందరు దొంగలు ఖజానాలోని సంపదను అపహరించడానికి ప్రయత్నించగా, అమ్మవారు వారిని ఊరు చివరి వరకు తరిమికొట్టిందట. తమని భయపెట్టిన శక్తి ఏమిటో తెలుసుకోవాలని ఆ దొంగలు ఒక మాంత్రికుడి సాయం తీసుకుని మళ్లీ ఆ ఊర్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. అంతే అమ్మవారి దృష్టి నుంచి వెలువడిన కాంతి ... అగ్నిగోళంగా మారి అది ఆ దొంగలతో సహా ఆ పరిసరాలను దహించివేసింది.

విషయం తెలుసుకున్న రాజు, శాంతించమంటూ అమ్మవారిని వేడుకున్నాడు. ఆయన కోరికమేరకు భక్తుల దర్శనార్థం ఆ ఊరులో వెలసిన 'రత్నాలమ్మ' ... జానపదుల భాషలో 'రాట్నాలమ్మ'గా పిలవబడుతూ పూజలు అందుకుంటోంది. కాలక్రమంలో పరివారదేవతలు కూడా ఇక్కడ కొలువుదీరారు. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ... అమ్మవారి ఆశీస్సులు పొంది ఆమె అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.


More Bhakti News