నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను ..  విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి  అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. లోక కల్యాణం కోసం .. హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం  నరసింహ స్వామి వైశాఖ శుక్ల చతుర్దశి రోజున ఆవిర్భవించాడు. దుష్ట శిక్షణ చేసి ధర్మానిదే  విజయమనే విషయాన్ని స్పష్టం చేశాడు.  

హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామి మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో లక్ష్మీ సమేతుడై ఆవిర్భవించాడు.  భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. ఆ స్వామి వెలసిన క్షేత్రాలు  మహిమాన్వితమైనవిగా వెలుగొందుతున్నాయి. నరసింహస్వామి జయంతిగా చెప్పుకుంటున్న ఈ రోజున తప్పక స్వామి వారి క్షేత్ర దర్శనం చేసుకోవాలి. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించాలి. ఈ రోజున స్వామివారికి  వివిధ రకాల పండ్లతో పాటు వడపప్పు - పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి  స్వామివారి నామ సంకీర్తనం చేయడం వలన, ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోతాయి. దుష్టగ్రహ పీడల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున నరసింహస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, అనేక సమస్యలు తొలగిపోతాయి. సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి.


More Bhakti News