చిత్రకూటంలో స్పటిక శిల ప్రత్యేకత

రామాయణంతో ముడిపడిన ప్రదేశాలలో .. సీతారాములు తిరుగాడిన పుణ్య ప్రదేశాలలో 'చిత్రకూటం' ఒకటి. సీతారాములు తమ వనవాస కాలంలో ఎక్కువ కాలం విడిది చేసిన ప్రదేశం ఇదేనని అంటారు. ఒకవైపున మందాకినీ నది .. మరో వైపున చిత్రకూట పర్వతం ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంటాయి. సీతారాములు తాము పడిన కష్టాలన్నింటినీ మరిచిపోయి ఇక్కడ ఎంతో సంతోషంగా ఉండేవారని చెబుతారు.

'రామ్ ఘాట్' .. 'సీతా కుండ్' .. 'హనుమాన్ ధార' ఇక్కడ చూడదగినవాటిలో ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ఆ జాబితాలోనే 'స్పటిక శిల' పేరు కనిపిస్తుంది. మందాకినీ నది సమీపంలో ఈ 'స్పటిక శిల' కనిపిస్తుంది. సీతారాములకు ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టమట. సీతారామలక్ష్మణులు అనునిత్యం ఈ ప్రదేశానికి వచ్చి స్పటిక శిలపై కూర్చునేవారట. ఇక్కడి నుంచి చిత్రకూటంలోని ప్రకృతి  సౌందర్యం అద్భుతంగా కన్పిస్తుందట. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ సీతారాములు మురిసిపోయేవారని అంటారు. వాళ్ల పాద ముద్రలు కూడా ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను వెదజల్లుతుంటాయి.


More Bhakti News