ఇక్కడి గోదాదేవి ప్రత్యేకత అదే

సాధారణంగా వేణుగోపాలస్వామి దేవాలయాలలో గోదాదేవి అమ్మవారు కొలువై కనిపిస్తారు. వేణుగోపాలస్వామివారితో కలిసి గర్భాలయంలోగానీ, ఉపాలయాల్లోగాని అమ్మవారు దర్శనమిస్తూ వుంటారు. అమ్మవారు ప్రత్యేక ఆలయంలో వున్నప్పుడు స్వామివారిని దర్శించుకున్న భక్తులు, అమ్మవారి దర్శనం చేసుకుంటూ వుంటారు. కానీ అందుకు భిన్నంగా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే వేణుగోపాల స్వామిని దర్శించుకునే ఆనవాయితీ ఒక క్షేత్రంలో కనిపిస్తుంది .. ఆ క్షేత్రమే 'బూరుగు గడ్డ'.

సూర్యాపేట జిల్లా .. హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి గర్భాలయంలో ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాలస్వామి దర్శనమిస్తుంటారు. ఒకే వేదికపై ఈ మూడు మూర్తులు ఉన్నప్పటికీ, వేణుగోపాలస్వామి ప్రధాన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో గోదాదేవి అమ్మవారు కనిపిస్తుంది. గర్భాలయంలో వేణు గోపాలుడు కుదురైన ఆకారంలో కనిపిస్తాడు. గోదాదేవి అమ్మవారి మూర్తి మాత్రం ఆరు అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. అమ్మవారి కనుముక్కుతీరు .. కోల కళ్లు .. కొప్పు అద్భుతమైన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాయి. అమ్మవారి మూర్తి ఇంత ఎత్తుగా ఉండటం చాలా అరుదు. పైగా ఈ మూర్తి తవ్వకాల్లో బయటపడింది. అమ్మవారి మహిమలను గురించి ఇక్కడి భక్తులు కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆ తల్లిని దర్శించుకున్న తరువాతనే వేణుగోపాలుడిని పూజించుకుంటూ వుంటారు.        


More Bhakti News