పుట్టలో నుంచి బయటపడిన లక్ష్మీనరసింహస్వామి

తూర్పుగోదావరి జిల్లాలోని పంచ నారసింహ క్షేత్రాలలో 'ఊడిమూడి' ఒకటి. రావులపాలెం సమీపంలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం మహిమాన్వితమైనదిగా చెబుతారు. పూర్వం ఇక్కడి ప్రధాన ఆలయంలో జ్వాలా నరసింహస్వామి మూర్తి ఉండేది. అయితే ఆయన దృష్టి పడిన దిశగా గ్రామంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేవట.

ఆ సమయంలో ఒక సాధువు ఆ గ్రామంలోకి వచ్చాడట. వశిష్ఠ గోదావరి తీరంలోని ఫలానా పుట్టలో లక్ష్మి నరసింహస్వామి మూర్తి ఉందనీ, ఆ మూర్తిని తీసుకొచ్చి ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. జ్వాలా నరసింహస్వామి మూర్తిని ఉపాలయంలో ప్రతిష్ఠించమని అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే పుట్టలో స్వామి మూలమూర్తి లభించింది. ఆయన సెలవిచ్చినట్టుగా ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిన దగ్గర నుంచి గ్రామంలో అగ్ని ప్రమాదాలు ఆగిపోయాయని స్థానికులు చెబుతుంటారు. 'భీష్మ ఏకాదశి' రోజున ఇక్కడి స్వామివారికి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.  


More Bhakti News