తల్లిదండ్రులను సంతోషపెడితే ప్రీతిచెందే లక్ష్మీదేవి

ఈ ప్రపంచంలో 'ఆకలవుతుందా?' అనే మాట అమ్మానాన్నల నోటి నుంచి మాత్రమే వస్తుంది. పిల్లలు 'ఆకలవుతుంది' అంటే ఆ క్షణంలోనే అన్నీ సమకూర్చాలనే ఆత్రుత అమ్మానాన్నల కళ్లలో మాత్రమే కనిపిస్తుంది. అందుకే అమ్మానాన్నలు వుంటే ఐశ్వర్యాలు అన్నీ వున్నట్టేనని అంటారు. పిల్లల కోసం ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా భరించే శక్తి అమ్మానాన్నలకి మాత్రమే ఉంటుంది. త్యాగాలకి .. అనురాగాలకి వాళ్లు కొలమానాలు.

అలాంటి తల్లిదండ్రులను కొంతమంది ఎంతమాత్రం పట్టించుకోరు. వాళ్ల బాగోగులు చూసుకోకుండా తమ సుఖాల కోసం మాత్రమే పరుగులు తీస్తుంటారు. తల్లిదండ్రులకి ఏ విధంగానూ సహకరించకపోగా, వాళ్లను విసుక్కునేవాళ్లు .. చేయిచేసుకునేవాళ్లు లేకపోలేదు. అలాంటివారి ఇంట్లో ఉండటానికి లక్ష్మీదేవి ఎంతమాత్రం ఇష్టపడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎవరైతే తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారో, తాము ఎంత కష్టపడినా ఫరవాలేదు అమ్మానాన్నలకు ఎలాంటి లోటు రానీయకూడదు అని భావిస్తారో అలాంటివారి ఇంట్లో ఉండటానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుందట. అందుకే సిరిసంపదలు కూడా తల్లితండ్రులతోనే ఉంటాయనే విషయాన్ని మరిచిపోకూడదు.          


More Bhakti News