ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు

శ్రీరాముడు .. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు అనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎదుటివారి మనసును నొప్పించడం .. ఇచ్చిన మాటను తప్పడం రాముడికి తెలియదు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన రాజ్య సుఖాలను వదిలి కట్టుబట్టలతో వనవాసానికి బయలుదేరాడు. తాను అడవులకు వెళ్లడానికి కారణమైన 'కైకేయి'ని కూడా రాముడు ఒక్క మాట అనలేదు. తన శరణు కోరిన సుగ్రీవుడిని .. విభీషణుడిని రక్షించి వాళ్లను రాజులుగా చేసిన శరణాగత వత్సలుడు రాముడు.

తనయుడిగా .. సోదరుడిగా .. శిష్యుడిగా .. స్నేహితుడిగా .. భర్తగా .. ప్రజాసేవకుడిగా రాముడు నిర్వహించిన పాత్ర ఎప్పటికీ ఆదర్శనీయమే. సత్యం .. ధర్మం .. ఓర్పు .. సహనం .. ధైర్యం శ్రీరాముడికి సహజమైన ఆభరణాలుగా కనిపిస్తాయి. ఒకే మాట .. ఒకే బాణం .. ఒకే భార్య రామచంద్రుడి ప్రతిజ్ఞా పాలనకు అద్దం పడతాయి. శ్రీరాముడు ఎంతటి పరాక్రమవంతుడో .. అంతటి క్షమాగుణం కలిగినవాడు అనడానికి అనేక సంఘటనలు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరాముడిని దర్శించుకోవడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. రాముడు అనుసరించిన మార్గాన్ని సూచించే 'రామాయణం' చదవడం వలన, గాయత్రి మంత్రాన్ని జపించిన ఫలితం దక్కుతుందనేది మహర్షుల మాట.          


More Bhakti News