కాకిని హంసగా మార్చిన హంసలదీవి

సాధారణంగా 'హంసలదీవి' అనే పేరు చూసి అక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో ... అందుకే ఆ పేరు వచ్చి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుందిగనుకనే ఈ పేరు స్థిరపడింది. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగానది మలినమైపోయింది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర వెళ్లబోసుకుంది. కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు. ఆ క్షేత్ర మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతను సంతరించుకుని ప్రవహించమని అన్నాడు.

దాంతో సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతోన్న కాకి, కృష్ణవేణి సాగర సంగమంలో మునిగిలేవగానే హంసగా మారిపోయింది. గంగానదికే పవిత్రతను ప్రసాదించిన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వెలసింది. ఇక్కడ కొలువుదీరిన శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో, దానిని ప్రతిష్టించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒకరికి స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం 'కాకరపర్తి'వెళ్లి ఓ గృహస్తుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా 'కాకర పర్తి' అనే పేరు వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. ఇక ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్టించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై వేణుగోపాలస్వామి ఇక్కడ పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ... తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరసంగమ (తుంగ - భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.


More Bhakti News