ఆదుకోవడమే ఆయనకి ఆనందం !

ఏదైనా అవసరమొచ్చో ... ఆపదవచ్చో ఎవరినైనా పిలిస్తే, ఏదో ఒక కారణం చెప్పి తప్పుకుంటూ వుంటారు. కానీ భగవంతుడు అలా వదిలేయడు ... అది ఆయన వలన కాదు. తనని నమ్మినవాళ్లు కష్టపడుతున్నా ... బాధపడుతున్నా ఆయన ఎలాంటి పరిస్థితుల్లోను చూస్తూ ఉండలేడు. తన భక్తులపై నిందలు మోపబడిన సమయంలోను ఆయన ఆదుకున్న సందర్భాలు అనేకం కనిపిస్తుంటాయి.

మొదట్లో శివనింద చేసిన మంజునాథుడు ఆ తరువాత భక్తుడుగా మారిపోతాడు. అలాంటి మంజునాథుడు కొంతమందిచే నిందను ఎదుర్కుంటాడు. కొండెక్కిన దీపాలు వాటంతటవే వెలిగేలా 'అంబికేశ్వర మహారాజు' సమక్షంలో చేయాలనే పరీక్షకు సిద్ధపడతాడు. ఆయన ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించగానే దీపాలు వాటంతటవే వెలుగుతాయి. భక్తుడిగా మంజునాథుడికి గల స్థాయిని స్పష్టం చేస్తాయి.

అలాగే ఆలయంలోని విఠలుడి విగ్రహం అదృశ్యం కావడానికి తుకారామ్ కారకుడనే నిందారోపణ చేయబడుతుంది. తనమీద పడిన నింద నిజం కాదని 'శివాజీ మహారాజు' సమక్షంలో ఆయన నిరూపించుకోవలసి వస్తుంది. దాంతో ఆయన ఆ పాండురంగస్వామిని ప్రార్ధిస్తాడు. తుకారామ్ అంటే గిట్టనివాళ్లు ఎక్కడో పాడుబడిన బావిలో పడేసిన స్వామివారి విగ్రహం దానంతట అది ఆలయానికి తిరిగివస్తుంది. తుకారామ్ మహాభక్తుడనే విషయాన్ని చాటిచెబుతుంది.

ఇలా భగవంతుడు తన భక్తులను నిందలనుంచి కాపాడటమే కాకుండా, వాళ్లు నిస్వార్థపరులనీ ... నిర్మలమైన మనసున్న వాళ్లని ఈ లోకానికి స్పష్టం చేస్తూ వచ్చాడు. అంతకుముందుకన్నా వాళ్లకి మరింత గౌరవమర్యాదలు లభించేలా చేశాడు. ఆ మహానుభావులు నడిచిన మార్గంలో మరెందరో ప్రయాణించేలా చేశాడు.


More Bhakti News