శివ శయనోత్సవం ఎందుకు చేస్తారు ?

పరమశివుడు ధర్మపక్షపాతి ... ధర్మ బద్ధమైన జీవితాన్ని కొనసాగించేవారిని అనుగ్రహించడంలో ఆయన ముందుంటాడు. మహాశివుడి మనసు మంచుకొండ అయితే, ఆయన చూపే కరుణ సముద్రమంత. నిరంతరం తన భక్తులను రక్షిస్తూ ... వారిని అనుగ్రహిస్తూ, అవనిని ఆకాశం కనిపెట్టుకుని ఉన్నట్టుగా వెన్నంటే ఉంటాడు.

అలాంటి సదాశివుడు 'ఆషాఢ పౌర్ణమి' నుంచి నాలుగు నెలల పాటు శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలసి సొలసిన స్వామి ఈ నాలుగు నెలలు పులిచర్మం పైనే పడుకుంటాడట. అలాంటి స్వామికి భక్తులెవరూ భంగం కలిగించకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తుంటారు.

స్వామి శయనించే ఈ సమయంలో ఆయనకి హాయిని కలిగించవలసిన బాధ్యత కూడా భక్తులపైనే వుంటుంది. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాల్లో శయనోత్సవాలు ... డోలోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని, స్వామివారిని సేవించి తరిస్తుంటారు.

సాధారణంగా శివుడిని 'ప్రదోష కాలం' లో అంటే సాయం సమయంలో పూజించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ఇక ఈ ఆషాఢ పౌర్ణమి విశిష్టమైనది కావడం వలన, ఈ రోజున ప్రదోష సమయంలో స్వామివారిని పూజించడం మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. చాలా ప్రాంతాల్లో ఈ రోజున 'రుద్ర వ్రతం' ఆచరిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News