పుణ్య ఫలాలను ప్రసాదించే విశిష్ట క్షేత్రం

పరమశివుడు ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో 'తొండవాడ' ఒకటిగా కనిపిస్తుంది. ఇది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలో అలరారుతోంది. ఇక్కడ సువర్ణముఖి ... కల్యాణి ... భీమనది కలుసుకుంటాయి కనుక ఇది 'త్రివేణి సంగమ క్షేత్రం' గా ప్రసిద్ధి చెందింది. పూర్వం అగస్త్యమహర్షి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, సహజసిద్ధంగా ఏర్పడిన ఒక శివలింగం ఆయనకి కనిపించిందట. ఆయన ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం వలన, ఈ స్వామిని అగస్తేశ్వరుడుగా కొలుస్తుంటారు.

'నారాయణవనం'లో పద్మావతీదేవిని పరిణయమాడిన వేంకటేశ్వరుడు, ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ స్వామి పాదాలను కూడా అగస్త్యుడు పూజించాడట. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శనమిస్తూ వుంటాయి. శ్రీవారి నిత్యనివాసమైన తిరుమలకు ... ఆయన వివాహం జరిగిన నారాయణ వనానికి సమీపంలో ఈ క్షేత్రం ఉండటం వలన ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

ఇక ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకున్న చోళరాజులు, అగస్త్యేశ్వరస్వామి సన్నిధిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ప్రస్తుతమున్న ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. త్రివేణి సంగమ ప్రాంతంలో ఏర్పడటం వలన ... సదాశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన కారణంగా ... సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నడచి వచ్చిన కారణంగా ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి సంగమ స్థానంలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక శ్రీవారి పాదముద్రను దర్శించుకోవడం వలన సకల సంపదలు ప్రాప్తిస్తాయి. అగస్త్యేశ్వరుడిని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News