ఏ అభిషేకం ధన ప్రాప్తిని కలిగిస్తుంది ?

చాలామంది తాము ధనానికి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వమని చెబుతుంటారు. సంపాదనే లక్ష్యమనుకుంటే చాలా సంపాదించే వాళ్లమని అంటుంటారు. ఆపదో ... అవసరమో వచ్చినప్పుడు, ఆర్ధికపరమైన సాయం లభించనప్పుడు ధనానికి గల ప్రాముఖ్యత ఎలాంటిదనేది అర్థవవుతుంది. ఎవరెన్ని చెప్పినా ప్రతి ఒక్కరికీ ధనమనేది అవసరమే. అయితే ఈ విషయంలో అత్యాశకి పోకుండా, మనశ్శాంతిని ఉంచేంత వరకూ ధనాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరుకోవచ్చు.

ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరూ ఒక్కో ఫలితాన్ని ఆశించి శివుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఆయురారోగ్యాలను ... సంతాన సౌభాగ్యాలను ఆశించే వాళ్లు పంచామృతాలతోను ... వివిధ రకాల పండ్ల రసాలతోను పరమశివుడిని అభిషేకిస్తుంటారు. ఇక ధనాన్ని మాత్రమే కోరుకునే వాళ్లు కేవలం కొబ్బరి నీళ్లతో మాత్రమే అభిషేకించాలని శాస్త్రం చెబుతోంది. ఆర్ధికపరమైన ఇబ్బందులు పడుతున్నవాళ్లు ... సంపదలు పెరగాలనుకునే వాళ్లు కొబ్బరినీళ్లతో ప్రతినిత్యం శివుడిని అభిషేకించాలి.

అత్యంత భక్తి శ్రద్ధలతో ... నియమనిష్ఠలతో ఆదిదేవుడిని అభిషేకించడం వలన సంపదలు కలుగుతాయనీ ... పెరుగుతాయని చెప్పబడుతోంది. ఇక సోమవారం రోజున ... మాసశివరాత్రి రోజున ... మహాశివరాత్రి రోజున చేసే అభిషేకం అనతికాలంలోనే ఆశించిన ఫలితం దక్కేలా చేస్తుంది. ఇక శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీకమాసంలో అనునిత్యం అభిషేకించడం వలన ఆయన మనసు గెలుచుకోవడం మరింత సులభమవుతుందని గ్రహించాలి.


More Bhakti News