ఈ కొండ గుహలోకి దేవతలు వస్తారట !

పరమశివుడు మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. సాధారణ మానవులకు సైతం తన అనుగ్రహం దక్కాలనే ఉద్దేశంతో మహర్షులు కోరడం వలన శివుడు స్వయంభువుగా వివిధ ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఈ నేపథ్యంలో శివుడు కైలాసంలో కాకుండా భూలోకంలోని కొన్ని ప్రదేశాలను సైతం తన నివాస స్థలాలుగా మార్చుకున్నాడు.

అందువలన ఆయన దర్శనం కోసం దేవతలు కైలాసానికే కాకుండా భూలోకంలోని ఆయా ప్రదేశాలకు వస్తూ వుండటం జరుగుతూ వుంటుంది. అలా సదాశివుడి దర్శనం కోసం దేవతలు దిగివచ్చే క్షేత్రంగా మనకి 'దైదా'లో కనిపిస్తుంది. గుంటూరు జిల్లా గురజాల సమీపంలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ... ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.

ఇక్కడ కొండపై గల గుహలో ... అక్కడి బిలంలో స్వయంభువు లింగం దర్శనమిస్తుంది. బిలం లోపలిభాగం విశాలంగా వుండటం, లోపలికి ప్రవేశించే మార్గం ... బయటికి వెళ్లే మార్గం ప్రత్యేకంగా వుండటం ఇక్కడి విశేషం. ప్రతిరోజు రాత్రి వేళలో దేవతలు వచ్చి స్వామివారిని పూజించి వెళ్తారని స్థానికులు చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా కొంతమందికి ఛాయామాత్రంగా కొన్ని రూపాలు కనిపించిన దాఖలాలు లేకపోలేదు.

దేవతలు వచ్చి స్వామివారిని సేవించుకుని వెళ్లిన కొంతసేపటి వరకూ ఈ ప్రదేశమంతా చక్కని సుగంధ పరిమళాలు వెదజల్లబడుతూ ఉంటాయట. మనోహరమైన ఆ పరిమళం దేవలోకానికి సంబంధించినదే గాని, భూలోకానికి చెందినది కాదని స్థానికులు నమ్మకంగా చెబుతుంటారు. ఈ పరిమళాన్ని బట్టే దేవతలు వచ్చారనే విషయం తెలుస్తూ ఉంటుందని వాళ్లు చెబుతుంటారు. దేవతలచే పూజలు అందుకునే స్వామి కనుకనే ఇక్కడి మహాదేవుడిని అమరలింగేశ్వరుడుగా భక్తులు కొలుస్తూ వుంటారు.


More Bhakti News