చారిత్రక వైభవం చెరిగిపోని క్షేత్రం

సాధారణంగా పుణ్యక్షేత్రాలనేవి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. పురాణపరమైన ప్రాశస్త్యం కలిగిన క్షేత్రాలు ... చారిత్రక నేపథ్యం కలిగిన క్షేత్రాలుగా అవి దర్శనమిస్తూ ఉంటాయి. దేవతలు నడయాడినట్టు చెప్పబడుతోన్న క్షేత్రాలను దర్శించినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అలాగే రాజులను ప్రభావితం చేసిన ఆలయాలను దర్శించినప్పుడు అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ప్రదేశంలోకి అడుగుపెట్టగానే ఆనాటి సంఘటనలు కళ్లముందు కదలాడుతుంటాయి.

అలాంటి అనుభూతికి గురిచేసే క్షేత్రంగా 'గురజాల' కనిపిస్తుంది. గురజాలలో నాటి చరిత్రకు అద్దంపట్టే అనేక ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయాలను పరిశీలించినప్పుడు నాటి రాజులు మహా శక్తిమంతులే కాదు, అంతకు మించిన భక్తిపరులనే విషయం బోధపడుతుంది. గుంటూరు సమీపంలో గల గురజాల పేరు వినగానే పల్నాటియుద్ధం తాలూకు సంఘటనలు సహజంగానే గుర్తుకొస్తాయి. పౌరుషానికి ప్రతీకలుగా నిలిచిన వీరులు గుర్తుకువస్తారు.

వీరత్వాన్ని తట్టిలేపిన దేవుడిగా ఇక్కడ వీరభద్రస్వామి కనిపిస్తుంటాడు. గర్భాలయంలో స్వామివారు వివిధ రకాల ఆయుధాలను ధరించి ఆజానుబాహుడుగా దర్శనమిస్తాడు. భద్రకాళీ సమేతంగా దర్శనమిచ్చే వీరభద్రుడుని నాటి వీరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా నాటి వీరులు యుద్ధ సమయాల్లో స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని యుద్ధరంగంలోకి ప్రవేశించే వాళ్లట.

పరమశివుడి ఆదేశం మేరకే వీరభద్రుడు ఈ ప్రదేశంలో ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. తొలిసారిగా స్వామివారికి పల్లవులు ఆలయాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. ఇక ఇదే గ్రామంలో సదాశివుడికీ .. ఇష్టకామేశ్వరీ దేవికి .. గ్రామదేవతగా చెప్పబడుతోన్న పాత పాటేశ్వరీ దేవికి .. హనుమంతుడికి ప్రత్యేక ఆలయాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. చరిత్రలో విరుగుడులేని వీరత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఈ క్షేత్రం, ఆనాటి వైభవాన్ని ఆధ్యాత్మిక వేదికపై అందంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది.


More Bhakti News