మహిమగల వెంకన్న వెలసిన కథ !

వేయినామాల వేంకటేశ్వరుడు శంఖు చక్రాలను ధరించి, వరద - కటి హస్తాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇందుకు భిన్నంగా ఆ స్వామి ఏదైనా క్షేత్రంలో కనిపిస్తే, అది ఆయన సంకల్పంగా ... అక్కడి క్షేత్ర విశిష్టతగా భావించాలి. అరుదైన ఆ రూపంలో ఆయనను పూజిస్తూ పునీతులు కావాలి. అలా శ్రీవేంకటేశ్వరుడు కత్తి .. డాలు ... సుదర్శన చక్రం ధరించి, అభయ హస్తంతో దర్శనమిచ్చే క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా 'మల్దకల్' లో అలరారుతోంది.

పూర్వం సోమభూపాలుడు అనే రాజు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండగా, ఏదో అద్భుతం జరగబోతున్నట్టుగా ఆయనకి అనిపించసాగింది. అడవిలోని ఓ చెట్టుకింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, అక్కడికి ఒక పశువులకాపరి వచ్చి, ఆయన తీసుకువెళ్లవలసిన విగ్రహం ఫలానా పొదల్లో ఉందని చెప్పాడట. విషయం అర్థంకాక వెళ్లిచూడగా అక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది.

స్వామివారి మూర్తి విలక్షణంగా ఉండటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది భగవంతుడి ఆదేశంగా భావించిన ఆయన, స్వామివారికి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆ విగ్రహాన్ని చూపించిన పశువుల కాపరినే అర్చకుడిగా నియమిస్తాడు. ఈనాటికీ వారి వంశీకులే అర్చకులుగా కొనసాగుతూ ఉండటం విశేషం. స్వామివారి ఆదేశం ప్రకారమే రాజు ఆ నిర్ణయం తీసుకున్నాడని చెబుతారు. ఆనాటి నుంచి ఇక్కడి గ్రామస్తులు స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు.

తమ దైవాన్ని మనస్పూర్తిగా విశ్వసించే ఇక్కడి భక్తులు, మరో క్షేత్రాన్ని దర్శించడానికి ఆసక్తి చూపించరు. ఆయనకంటే ఎత్తులో నివాసం ఉండకూడదనే ఉద్దేశంతో, అంతకన్నా తక్కువ ఎత్తువరకే నిర్మాణాలు చేపడుతుంటారు. ఈ విషయాల్లో స్వామి తమకి ఎన్నో నిదర్శనాలు చూపాడనీ, అందుకే తాము ఈ నియమాలను ఆచరిస్తూ ఉంటామని చెబుతుంటారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ కనిపించే వేంకటేశ్వరస్వామి ప్రతిమ .. ఆయన వెలుగుచూసిన తీరు .. స్వామి విషయంలో గ్రామస్తులు పాటిస్తోన్న నియమాలు చూస్తే, నిజంగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయం బోధపడుతుంది.


More Bhakti News