ఆకలితీర్చే ఆనందసాయి క్షేత్రం

నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ తన భక్తులకు అనంతమైన సంపదలను అనుగ్రహించిన సద్గురువు శిరిడీసాయి. ఆపద ... ఆకలి .. ఆవేదన ఈ మూడు ఎక్కడ వుంటే అక్కడ సాయి ప్రత్యక్షమవుతాడు. వీటి బారినపడిన తన భక్తులను ఆదుకుంటాడు. ఈ కారణంగానే సాయిబాబాను ఆరాధించే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో శిరిడీసాయి ఆలయాలు పెద్ద సంఖ్యలో నిర్మించబడ్డాయి.

అలా భక్తులను అనుగ్రహించడానికి కొలువుదీరిన ఆలయాలలో హైదరాబాద్ - చాదర్ ఘాట్ లోని బాబా ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. చాలాకాలం క్రితమే నిర్మించబడిన ఈ ఆలయం, గురువారం వస్తే చాలు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. ఈ ఆలయంలో సాయిబాబా దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ వుంటాడు. తానున్నచోట ఆకలి ... ఆపద ... ఆవేదన ఉండవని భరోసా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు.

భక్తులు ముందుగా 'ధుని' కి ప్రదక్షిణలు చేసి ఆ తరువాత ద్వారకామాయిలో గల సాయిని దర్శించుకుంటారు. ప్రతి నిత్యం హారతులు ... అభిషేకాలు జరుగుతుంటాయి. ఇక గురువారం రోజున ప్రత్యేక అలంకారాలు ... సేవలు నిర్వహిస్తుంటారు. సాయిబాబాను దర్శించిన భక్తులు దానధర్మాలు చేయకుండా వెళ్లకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ కారణంగా గురువారం రోజున ఇక్కడికి ఎంతో మంది అనాథలు ... అభాగ్యులు చేరుకుంటారు.

ఈ విధంగా ప్రతి గురువారం రోజున ఎంతో మంది నిరాశ్రయులకు ... నిస్సహాయులకు ఇక్కడ ఆకలితీరుతూ వుంటుంది. వారి సంతోషాన్ని చూసి సంతృప్తిని పొందుతున్నట్టుగా బాబా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తూ వుంటాడు. ఈ కారణంగానే భక్తులు బాబాను ఆకలితీర్చే ఆనందసాయిగా కొలుస్తూ వుంటారు. ఇదే ప్రాంగణంలో గంగాధరుడికీ ... గాయత్రీ మాతకు ప్రత్యేక మదిరాలు కనిపిస్తాయి. విశేషమైన పర్వదినాల్లో అశేష సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించి ఆయన ఆశీస్సులు అందుకుంటూ ... అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.


More Bhakti News