వింత మామిడి చెట్టు

ఒక కడుపున పుట్టిన పిల్లలందరూ ఒకే లక్షణాలను కలిగి ఉండరనేది ఎంత నిజమో ... ఒక చెట్టుకు కాసిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉంటాయనేది అంతే నిజం. అయితే 'కంచి' క్షేత్రంలో గల ఒక మామిడి చెట్టు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి చెట్టుకు గల నాలుగు ప్రధానమైన కొమ్మలకు నాలుగు రకాల మామిడి పండ్లు కాయడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

తమిళనాడుకి చెందిన మహా పుణ్యక్షేత్రాల్లో 'కంచి' ఒకటి. పంచభూత క్షేత్రాల్లో ఇది మొదటిదిగా చెప్పబడుతోంది. పరమశివుడు ఇక్కడ మట్టితో చేయబడిన లింగరూపంలో ఆవిర్భవించి, 'ఏకాంబరేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు. సాక్షాత్తు పార్వతీ దేవి ఇక్కడి శివలింగాన్ని తయారు చేయడం వలన ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో దర్శనమిచ్చే ఈ ఆలయం, భక్తుల మనసును భారీగా దోచుకుంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మూడువేల అయిదువందల సంవత్సరాల నాటి ఒక మామిడి చెట్టు దర్శనమిస్తుంది. ఇది మహిమాన్వితమైన మామిడి చెట్టు అనీ, ఈ చెట్టుకి గల నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీకలని స్థానికులు చెబుతుంటారు. ఇక ఈ నాలుగు కొమ్మలకు నాలుగు రకాల మామిడి పండ్లు కాయడం విస్మయానికి గురిచేస్తుంటుంది.

దైవశక్తి సంబంధమైన ఈ మామిడి చెట్టును దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని ఇక్కడి వాళ్లు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఏకాంబరేశ్వరుడిని ... కామాక్షీ దేవిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ, మహిమాన్వితమైన ఈ మామిడి చెట్టుని కూడా చూసి వెళ్లడమనేది ఆనవాయతీగా వస్తోంది.


More Bhakti News