ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శివుడే తెచ్చిన శివలింగం

Sat, Oct 26, 2013, 10:58 AM
Related Image శివుడి లీలావిశేషాలను గురించి చెప్పుకోవడానికి ... ఆయన ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంతగా ఆయన తన లీలా విన్యాసాలను ఆవిష్కరించాడు ... భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ఆయన వెలసిన ప్రతిక్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. అలాంటి మహిమాన్విత క్షేత్రాల జాబితాలో నెల్లూరు జిల్లాలోని 'వెంకటగిరి' ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ శివుడు కొలువైన తీరు ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. పూర్వం ఈ ప్రాంతం యాచమనాయుడు ఏలుబడిలో వుండేది. ఆయన మహా శివభక్తుడు ... ఎన్ని పనులున్నా శివారాధనను విస్మరించేవాడు కాదు. అప్పట్లో ఒక బ్రాహ్మణుడు రాజావారిని కలుసుకుని, తాను కాశీ క్షేత్రం నుంచి వస్తున్నట్టుగా చెప్పాడట. తన దగ్గర అత్యంత శక్తిమంతమైన శివలింగం ఉందనీ, ఆలయాన్ని నిర్మించి అందులో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే, ఆ రాజ్యాన్ని అది రక్షిస్తూ ఉంటుందని అన్నాడు.

ఆ బ్రాహ్మణుడి తేజస్సు ... ఆయన మాటల్లోని నిజాయితి కారణంగా రాజావారు ఆ శివలింగాన్ని స్వీకరించాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్లిపోయాక ... ఆ రూపంలో వచ్చినది సాక్షాత్తు శివుడేననే విషయాన్ని రాజావారు గ్రహించాడు. శివుడి ఆదేశంగా భావించి ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించాడు. స్వామి కాశీ నుంచి వచ్చినట్టు చెప్పాడు గనుక, ఇక్కడి శివయ్యని 'కాశీ విశ్వనాథుడు' అనే పిలుస్తుంటారు.

రాజావారికి శివుడి పట్ల గల భక్తి శ్రద్ధలకు ఆలయ నిర్మాణం అద్దంపడుతూ వుంటుంది. గర్భాలయంలో స్వామివారు, ఆ పక్కనే గల మందిరంలో అమ్మవారు పూజలు అందుకుంటూ వుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో కొలువైన నాలుగు శివలింగాలు, శ్రీకాళ హస్తీశ్వరుడు .. ఏకాంబరేశ్వరుడు .. మల్లేశ్వరుడు .. సుందరేశ్వరుడు పేర్లతో కొలవబడుతూ వుంటాయి.

ప్రధాన దైవాన్ని దర్శించిన అనంతరం, భక్తులు ఈ శివలింగాలను పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయం రద్దీగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన దారిద్ర్యం నశించి, సంపదలు ... సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192