ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శంభులింగేశ్వర క్షేత్రం

Tue, Oct 15, 2013, 11:03 AM
Related Image మహాశివుడి లీలా విశేషాలను గురించి పురాణాలు చెబుతున్నాయి ... అందుకు నిదర్శనంగా ఆయన క్షేత్రాలు అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత మహిమాన్వితను చాటుకుంటున్నాయి. నల్గొండ జిల్లా 'మేళ్ల చెరువు'లో వెలుగొందుతోన్న శైవ క్షేత్రం కూడా ఈ కోవలోనిదే. ఇక్కడి శివుడిని 'శంభులింగేశ్వరుడు' గా భక్తులు కొలుస్తూ వుంటారు.

పూర్వం మేకలు తమ పాలతో మట్టి పుట్టను కరిగించడం వలన ఇక్కడి శివలింగం బైటపడిందని చరిత్ర చెబుతోంది. 12 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలను బట్టి తెలుస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ... అందమైన మంటపాలు ... పొడవైన ప్రాకారాలు నాటి వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. ఇక్కడి నంది విగ్రహం జీవంతో తొణికిసలాడుతుంటుంది.

ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత వుంది. శివుడి తలపై గంగమ్మ ఏ స్థానంలో వుంటుందో ... అక్కడే ఈ శివలింగానికి చిన్నపాటి గుంట వుంటుంది. ఈ గుంటలో నిరంతరం నీరు ఊరుతూ వుంటుంది. అయితే ఎంతగా తోడినా నీరు తగ్గక పోవడం, తోడకుండా వుంటే పొర్లిపోవడం అనేవి జరగకపోవడం వింతగా ... విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. శివుడి తలపై గల ఈ గుంటలోని నీటిని చిన్న పూలమాలను ముంచి తీస్తూ, ఆ నీటిని తీర్థంగా ఇస్తుంటారు.

ఈ తీర్థాన్ని స్వీకరించడం వలన సమస్త వ్యాధులు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. పవిత్రమైన ఈ నీటిని తమ ఇంటి బావుల్లో కలపడం, తమ పంటపొలాల్లో చల్లడం వంటివి చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ... కార్తీకమాసంలోను స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించి తరిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128