ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీ వేణుగోపాలస్వామి

Wed, Jun 05, 2013, 02:37 PM
Related Image బాల కృష్ణుడు అల్లరివాడు ... అందరివాడు అనే విషయం తెలిసిందే. వెన్నలను దొంగిలించడం కృష్ణుడికి అలవాటు ... అయితే ఆయన భక్తులు కూడా ఆయన విగ్రహాన్ని దొంగిలించి తీసుకు వచ్చి ప్రతిష్ఠ చేయడం మరింత ఆశ్చర్యకరంగా అనిపించకమానదు. ఈ సంఘటన జరిగిన ప్రదేశమే మెదక్ జిల్లా దుబ్బాక మండలంలోని 'చెల్లాపూర్'.

ఇక శ్రీ కృష్ణుడి అల్లరి చేష్టలు లోక కల్యాణం కోసమైతే, ఆయన భక్తులు ఈ దొంగతనం చేసింది మాత్రం దొరల పెత్తందారితనం నుంచి తమని తాము కాపాడటం కోసమే. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దొరల ఏలుబడిలో వుండేది. పన్నుల పేరుతో దొరలు గ్రామస్తులను అనేక విధాలుగా హింసించేవారు. గ్రామస్తులంతా దొరపై తిరగబడటంతో, వారి దగ్గరనుంచి డబ్బు వసూలు చేసేది వారి ఊళ్లో ఓ గుడి కట్టించడానికి అని చెప్పాడట. దాంతో గ్రామస్తులంతా కలిసి తామే ఓ గుడి కట్టి దొర పెత్తనానికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

విగ్రహం చెక్కడానికి చాలాకాలం పడుతుందని భావించి, అదే జిల్లాలోని ఓ పురాతనమైన ఆలయంలో పూజకు నోచుకోకుండా పడి వున్న 'వేణు గోపాలస్వామి' విగ్రహాన్ని దొంగిలించి తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆ ఊరు ప్రజలు గొడవకి వస్తున్నారని తెలిసి ఆ స్వామికి మీసాలు ... కిరీటం పెట్టారు. దాంతో ఆ వూరు పెద్దలు ఆ విగ్రహాన్ని పోల్చుకోలేక, అది తమ ఊరుకి చెందినది కాదని చెప్పేసి వెళ్లిపోయారట. అలా ఇక్కడి శ్రీకృష్ణుడు మీసాలు ... కిరీటం కలిగివుండి ఓ ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తున్నాడు.

ఈ గ్రామ ప్రజలను ఇబ్బంది పెడదామనుకున్న దొర కూడా కృష్ణుడి రాకతో మనసు మార్చుకుని, తన వంతుగా విరాళాన్ని కూడా అందజేసి వెళ్లిపోయాడట. ఇక ఆ నాటి నుంచి నేటి వరకూ ఈ దేవాలయంలోని అఖండ దీపం వెలుగుతూనే వుండటం విశేషం. ఆలయ ప్రాంగణంలో హనుమంతుడి మందిరం ... కోనేరు కనిపిస్తాయి. దాదాపు రెండువంద యేళ్ళ చరిత్ర గల ఈ ఆలయం ప్రశాంతతకు ... పవిత్రతకు మారుపేరుగా వెలుగొందుతూనే వుంది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38