ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అత్తిరాల ఆలయం

Wed, Jun 05, 2013, 12:28 PM
Related Image శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో 'అత్తిరాల' ఒకటి. శ్రీమన్నారాయణుడు గదాధరుడై వెలసిన ఈ పుణ్య క్షేత్రం కడప జిల్లా రాజంపేట మండలం పరిధిలోని అత్తిరాలలో వుంది. శ్రీ మహావిష్ణువు పాదము ఒకటి గయలో వుండగా మరొకటి ఈ క్షేత్రంలో ఉండటం వలన గయకు సమానమైన క్షేత్రంగా దీనిని గురించి చెప్పుకుంటారు. పరమశివుడు 'త్రేతేశ్వరుడు'గా పిలవబడుతోన్న ఈ క్షేత్రంలో పరశురాముడికి కూడా ఆలయం కనిపిస్తుంది.

ఈ ఆలయాలను 9 వ శతాబ్దంలో చోళ - పల్లవ రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. త్రేతాయుగంలో తండ్రి ఆదేశం మేరకు పరశురాముడు తల్లి శిరస్సును ఖండించాడు. అయితే ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి ఆయన అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. అయినా మాతృ హత్యా పాతకం నుంచి బయటపడలేక పోయాడు. అలాంటి పరిస్థితుల్లో అయన ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి నదిలో స్నానమాచరించి శ్రీ కామాక్షీ దేవి సమేతుడై వెలసిన త్రేతేశ్వరస్వామిని పూజించడం వలన హత్యాదోషం నివారించబడిందట. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి 'హత్యరాలె' అనే పేరు వచ్చిందని ... కాలక్రమంలో అది 'అత్తిరాల'గా మారిందని చెబుతుంటారు.

ఇక ఇక్కడి నదిని 'చెయ్యేరు' ... అనీ 'బాహుదా నది' అని స్థానికులు పిలుస్తూ వుంటారు. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిపై దొంగతనం ఆరోపించబడింది. విచారణ సరిగ్గా జరపకుండానే రాజాజ్ఞ ప్రకారం అతని రెండు చేతులు ఖండించారు. దాంతో ఆ వ్యక్తి తన నిజాయితిని నిరూపించుకోవడానికి నదిలో ప్రవేశించగా, తిరిగి రెండు చేతులూ వచ్చాయట. అందువలన ఈ ప్రవాహానికి 'చెయ్యేరు' ... 'బాహుదానది' అనే పేర్లు వచ్చాయని స్థలపురాణం చెబుతోంది.

అన్నమాచార్యుల వారు తరచూ ఈ ఆలయాన్నిదర్శించి, తన సంకీర్తనామృతాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేవాడని అంటారు. కార్తీక మాసంలోను ... మహా శివరాత్రి పర్వదినం సందర్భంగాను ఇక్కడ జరిగే విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237