ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వేంకటగిరి పోలేరమ్మ

Tue, Sep 24, 2013, 01:57 PM
Related Image దక్షిణ భారతదేశంలో జరిగే ప్రసిద్ధి చెందిన జాతరలలో 'వేంకటగిరి పోలేరమ్మ జాతర' ఒకటి. నెల్లూరు జిల్లాలోని ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన పోలేరమ్మ భక్తుల పాలిట కల్పవృక్షమై అలరారుతోంది. సాధారణంగా అన్ని ప్రాంతాలలోను పోలేరమ్మ గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుంటుంది. కానీ ఇక్కడ పోలేరమ్మకి గల ప్రత్యేకత ... విశిష్టత వేరు.

ఈ కారణంగానే ఇక్కడి జాతర వేలసంఖ్యలో తరలివచ్చే భక్తుల మధ్య భారీగా జరుగుతూ వుంటుంది. 17 వ శతాబ్దం ప్రథమార్థంలోనే ఇక్కడ పోలేరమ్మ జాతర నిర్వహించబడినట్టు ఆధారాలు వున్నాయి. ఆంగ్లేయ అధికారులు సైతం ఇక్కడి అమ్మవారిని ఆరాధించడం విశేషం . 1913లో ఈ ప్రాంతంలో కలరా వ్యాధి ప్రబలగా వేలాదిగా ప్రజలు చనిపోతూ ఉండటంతో, వేంకటగిరి రాజావారు 'శీతలయాగం' నిర్వహించి ... పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేయించాడు. దాంతో కలరావ్యాధి ఈ గ్రామంలో కనిపించకుండా పోయింది.

పోలేరమ్మ అనుగ్రహమే అందుకు కారణమని భావించిన ప్రజలు, ఆనాటి నుంచి ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ తరువాత వచ్చే మూడవ బుధ - గురువారాల్లో అమ్మవారికి వైభవంగా జాతరను నిర్వహించడం ఆరభించారు. కాలక్రమంలో ఈ జాతర ఘనత పెరుగుతూ వచ్చింది. కుమ్మరివారు అమ్మవారి విగ్రహాన్ని పుట్టమట్టితో తయారుచేయగా, ఆ ప్రతిమకు గాలిగంగలు కళ్లను అమర్చుతారు.

ఆ తరువాత అమ్మవారిని ఆలయానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి వేంకటగిరి రాజుల నివాసానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అక్కడ అమ్మవారు తొలి పూజలు అందుకున్న తరువాత తిరిగి ఆలయానికి తీసుకువచ్చి భక్తుల దర్శనార్థం ఉంచుతారు. మరునాడు మధ్యాహ్నం వరకూ పురవీధుల్లో అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఆ సాయంత్రం జరిగే నిమజ్జనోత్సవ ఊరేగింపులో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు.

దేశంలో ఎక్కడ వున్నా ఈ ఉత్సవం రోజు నాటికి ఈ గ్రామస్తులు ఇక్కడికి చేరుకుంటారు ... ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటారు. నిమజ్జన సమయంలో అమ్మవారి మట్టిని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. ఈ మట్టిని తమ పూజా మందిరాలలో వుంచడం వలన సకల శుభాలు జరుగుతాయని వాళ్లు విశ్వసిస్తూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171