ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిత్రకూటం

Fri, Jul 05, 2013, 03:24 PM
Related Image 'చిత్రకూటం' పేరు వినగానే ఆ ప్రదేశంలో జరిగిన రామాయణ సన్నివేశాలు కళ్ళ ముందర కదలాడతాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా మధ్య ప్రదేశ్ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. పచ్చని కొండలు ... వేగంగా ప్రవహించే వాగులు ... జలపాతాలు ... అందంగా ఆహ్లాదకరంగా సాగిపోయే మందాకినీ నది యాత్రికుల హృదయాలను కొల్లగొడతాయి.

సతీ అనసూయ తపోభూమిగా చెప్పబడుతోన్న ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనసు మనలో వుండదు. ఎందుకంటే సీతారాములు అరణ్యవాసం సమయంలో ఇక్కడే తిరుగాడినట్టు చెబుతారు. అందువలన వాళ్లు విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలు ... స్నానమాచరించిన ప్రదేశాలు ... తపమాచరించిన ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి.

ఈ ప్రదేశంలోనే అమ్మవారి వక్ష స్థలాన్ని కాకాసురుడు పొడవగా, ఆ కాకి పైకి శ్రీ రాముడు దర్భను ప్రయోగించాడు. ఫలితంగా ఆ కాకి కన్ను పోయింది ... అందుకే నేటికీ కాకులు ఒక కన్నుతో ఏటవాలుగా చూస్తూ ఉంటాయని అంటారు. ఇక్కడి 'హనుమాన్ ధార' చూడదగినది. 2000 మెట్లెక్కి ఈ కొండ పై భాగానికి చేరుకోవాలి. ఇక్కడి పురాతనమైన ఆంజనేయ స్వామి విగ్రహం పై నిరంతరం జలధార పడుతూనే వుంటుంది.

గుప్త గోదావరి ప్రవహిస్తోన్న ఈ ప్రదేశానికి కొంత దూరంలో యమునా నది ప్రవహిస్తూ వుంటుంది. శ్రీ రాముడు ఎక్కువ కాలం కొలువుదీరిన ప్రదేశమంటూ 'కామత్ గిరి' అనే కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. రామాయణంలో విన్న ప్రదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ అనుభూతిని ఆ సాంతం ఆస్వాదించవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204