ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమస్యలు తొలగించే సత్యనారాయణస్వామి

Wed, Nov 26, 2014, 02:17 PM
Related Image సత్యనారాయణస్వామి త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతున్నాడు. ఈ స్వామిని పూజించడం వలన త్రిమూర్తులను సేవించిన ఫలితం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది. సత్యనారాయణస్వామిని దర్శించడం వల్లనే అనేక దోషాలు నశిస్తాయి. ఎలాంటి కష్టాలైనా స్వామివారితో చెప్పుకున్నదే తడవుగా కనుమరుగై పోతాయి.

ఈ కారణంగానే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సత్యనారాయణ వ్రతం జరుపుకునే భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. సత్యనారాయణస్వామిని పూజించి ఆయన ప్రసాదం స్వీకరించడం వలన సకల శుభాలు చేకూరతాయి. అందువలన భక్తులు సత్యనారాయణస్వామిని ఆరాధించడంలో ఎంతమాత్రం అశ్రద్ధ చూపరు.

సత్యనారాయణస్వామి ఆలయాలు ఎక్కడ ఉన్నా నిత్యం భక్తుల రాకతో సందడిగా కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి 'గవరవరం' లో దర్శనమిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. చాలాకాలం క్రితం ఒక భక్తుడి సంకల్పం కారణంగా ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతుంటారు.

కుదురుగా కనిపించే ఈ ఆలయంలో 'రమా సహిత సత్యనారాయణస్వామి' కొలువుదీరి ఉంటాడు. భక్తులంతా కలిసి ప్రతి గురువారం ఇక్కడ భజనలు చేస్తుంటారు. ఈ భజనలో పాల్గొంటే మనసు పరవశించి పోతుంది. ప్రతి ఏకాదశి రోజున ఇక్కడ 'ఏకాదశి వ్రతం' జరుపుతుంటారు. ఇక ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఇక్కడ అయిదు రోజులపాటు ప్రత్యేక పూజలు ... విశేషమైన సేవలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కళకళలాడుతూ కనిపిస్తాయి. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా దర్శిస్తే చాలు ... సమస్యలన్నీ తొలగిపోయి శుభాలు చేకూరతాయని భక్తులంతా ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38