ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వినాయక పూజలో తులసి

Thu, Jun 20, 2013, 02:11 PM
Related Image తులసి మొక్కను పరమ పవిత్రమైనదిగా అందరూ భావిస్తుంటారు. ఈ కారణంగానే ప్రతి ఇంట్లోను తులసికోట కనిపిస్తూ వుంటుంది. తులసిని పూజించిన తరువాతనే చాలామంది స్త్రీలు తమ దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ వుండటం ఆచారంగా వస్తోంది. గుడిలోకి వెళితే తులసి కలిసిన తీర్థాన్నే ఇస్తుంటారు. ఇక నిత్య పూజల్లో తులసి దళాలను ... ఉత్సవాల్లో తులసి దండలను ఉపయోగిస్తూ వుంటారు. అంతటి విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న తులసిని వినాయకుడి పూజలో వాడకూడదని అనడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.

గరిక దగ్గరనుంచి అన్ని రకాల అడవిపూలు ... ఆకులు ఆయన పూజకు వాడుతున్నప్పుడు, తులసి ఎందుకు వాడకూడదనే సందేహం రావడం ... దానిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది. వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా అంగీకరించకపోవడం ఆమెకి ఆగ్రహావేశాలను కలిగించింది. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపొమ్మంటూ శపించింది. అందచందాలను కోల్పోయి అసురులతో కలిసి జీవించమని వినాయకుడు ప్రతి శాపమిచ్చాడు.

దాంతో తన తొందరపాటును మన్నించమంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుని, శాపకాలాన్ని తగ్గించమని కోరింది. దాంతో కొంతకాలంపాటు రాక్షసులతో కలిసి జీవించాక, తులసిగా జన్మిస్తావంటూ వినాయకుడు ఉపశమనాన్ని కలిగించాడు. తనని శపించిన ఆమె అవతారమే తులసి కావడంవలన తన పూజలో తులసిని వాడటం వినాయకుడు ఇష్టపడడని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలుపుతున్నాయి. అయితే 'వినాయక చవితి' రోజున మాత్రం పూజకు ఉపయోగించే 21 రకాల పత్రులలో భాగంగా తులసిని సమర్పించడంలో దోషంలేదని అంటున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121