ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సప్తమి నుంచి అమ్మవారి ఆరాధన

Mon, Sep 29, 2014, 01:24 PM
Related Image సాధారణంగా శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతూ వుంటాయి. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారు ఒక్కో రోజున ఒక్కో రూపాన్ని ధరించి, భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మవారిని ఆరాధించే భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు ఒకపూట మాత్రమే భోజనం చేయడమనేది నియమంగా కనిపిస్తుంది.

ఇలా తొమ్మిది రోజులు చేయలేనివాళ్లు 'సప్తమి' .. 'అష్టమి ' .. 'నవమి' రోజులలో అమ్మవారిని ఆరాధించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రులలో ఏడవ రోజున అమ్మవారు 'కాళరాత్రి దుర్గ' రూపంలో ... మొగలిపూల అలంకరణతో దర్శనమిస్తుంది. గాడిదను వాహనంగా కలిగిన ఈ అమ్మవారికి వివిధ రకాల కూరగాయ ముక్కలను కలిపి వండిన అన్నం నైవేద్యంగా సమర్పించబడుతుంది. శత్రువులను భయకంపితులను చేసే ఈ తల్లి తన భక్తులకు సకల శుభాలను ప్రసాదిస్తుందని చెబుతారు.

అలాగే 'అష్టమి' రోజున అమ్మవారు 'మహాగౌరి' రూపంలో భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. ఎద్దును వాహనంగా కలిగి వున్న ఈ అమ్మవారిని గులాబీలతో అలంకరించి ... ఆమెకి ఎంతో ప్రీతికరమైన 'చక్కెర పొంగలి'ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇక 'నవమి' రోజున అమ్మవారు 'సిద్ధి ధాత్రి'గా భక్తుల మనసు దోచుకుంటుంది. కమలాన్ని ఆసనంగా చేసుకున్న ఈ అమ్మవారిని మరువాలు ... దవనాల మాలికలతో అలంకరిస్తూ వుంటారు.

దసరా నవరాత్రులలో నవమి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని కనిపిస్తుంది. విజయదశమి రోజున పునః పూజ చేసి ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమైన పూజను నవమి రోజునే చేయవలసి వుంటుంది. ఈ రోజున దర్శనమిస్తోన్న అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఈ విధంగా నవరాత్రులలోని చివరి మూడురోజుల్లో అమ్మవారిని అంకిత భావంతో ఆరాధించడం వలన, పాపాలు ... దోషాలు ... వ్యాధులు నశించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204