ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీ పురుహూతికా దేవి

Tue, Jun 18, 2013, 04:08 PM
Related Image అష్టాదశా శక్తి పీఠాల్లో ఒకటైన 'శ్రీ పురుహూతికా దేవి' శక్తి పీఠం పిఠాపురంలో భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. సతీదేవి 'ఎడమ హస్తం'ఈ ప్రాంతంలో పడినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి అమ్మవారు పురుహూతికాదేవి గా పూజలు అందుకోవడానికి, సాక్షాత్తు సదాశివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా కొలువుదీరడానికి వెనుక ఓ పురాణగాధ వినిపిస్తోంది.

పూర్వం 'గయాసురుడు'అనే రాక్షసుడు, ఇంద్రుడి సింహాసనాన్ని సొంతం చేసుకుని దేవతలందరినీ పీడించసాగాడు. దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ పండితుల వేషాలను ధరించి గయాసురుడి దగ్గరికెళ్లి తాము ఒక యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. భూమాత ఆ వేడిని తట్టుకోలేదనీ ... దానిని అతని దేహం మాత్రమే భరించగలదని అన్నారు. తన దేహాన్ని యజ్ఞ వాటికగా ఉంచడానికి గయాసురుడు అంగీకరించడంతో, వారం రోజుల పాటు సాగే ఈ యజ్ఞానికి ఎలాంటి పరిస్థితుల్లోను భంగం కలగకూడదనీ ... అదే జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.

గయాసురుడి తల దగ్గర విష్ణువు ... నాభి దగ్గర బ్రహ్మ ... పాదాల చెంత శివుడు కూర్చుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఏడో రోజు అర్ధరాత్రి వరకూ కూడా ఆ యజ్ఞం వేడిని గయాసురుడు భరిస్తూ వచ్చాడు. దాంతో తెల్లవారితే మళ్లీ గయాసురుడిని నియంత్రించడం కష్టమని భావించిన శివుడు, పార్వతీదేవిని అక్కడికి ఆహ్వానించాడు. ఆమె సూచనమేరకు శివుడు అర్ధరాత్రివేళ కోడిలా కూశాడు. తెల్లవారిందనుకుని గయాసురుడు కదలడంతో యజ్ఞ భంగం జరిగింది.

దాంతో బ్రాహ్మణ పండితులు గయాసురుడి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. వాళ్లు తనని సంహరించడానికి వచ్చిన త్రిమూర్తులని గయాసురుడు గ్రహించి సంతోషించాడు. అతని దేహం నశించక తప్పదనీ, ఆ ప్రదేశంలో తాము క్షేత్ర దేవతలుగా కొలువుదీరతామని త్రిమూర్తులు అనుగ్రహించారు. శివుడు కోడిలా కోసిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వర క్షేత్రంగా ... గయాసురుడి పాదాల చెంత కూర్చుని శివుడు యజ్ఞం చేసిన కారణంగా 'పాదగయ'గా ఈ శక్తి పీఠం పిలవబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.176.107