ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆటంకాలు కలగకుండా చూసే అమ్మవారు

Wed, Sep 03, 2014, 02:34 PM
Related Image జమదగ్నిమహర్షి భార్య ... పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ... రేణుకా ఎల్లమ్మ పేరుతో అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటుంది. గ్రామస్తులంతా అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆశీస్సులే తమని కాపాడుతూ ఉంటాయని విశ్వసిస్తూ వుంటారు.

అలా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం మనకి నల్గొండ జిల్లా 'త్రిపురారం'లో కనిపిస్తుంది. ఈ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉండగానే అమ్మవారి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. అమ్మవారే స్వప్న దర్శనమిచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేసుకుందని చెబుతుంటారు. ఆసక్తికరమైన ఆ కథనాన్ని గురించి ఇక్కడ ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు.

ఈ గ్రామంలో ప్రాచీనకాలంనాటి శివాలయం శిథిలం కావడంతో, పునరుద్ధరించడానికి ఒక భక్తుడు పూనుకున్నాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ భక్తుడికి కలలో రేణుకా ఎల్లమ్మ కనిపించిందట. ఒకప్పుడు శివాలయ నిర్మాణ సమయంలో తన ఆలయాన్ని పడగొట్టి, తిరిగి నిర్మించడం మరిచిపోయారనే విషయాన్ని ఆ భక్తుడికి చెబుతుంది. ఈసారి తన ఆలయాన్ని నిర్మించమనీ, శివాలయ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని అంటుంది.

దాంతో ఆ భక్తుడు గ్రామస్తులతో ఆ విషయాన్ని గురించి చెప్పి అమ్మవారి ఆదేశాన్ని అక్షరాలా పాటిస్తాడు. దాని ఫలితంగానే ఇప్పుడున్న అమ్మవారి ఆలయం కనిపిస్తూ వుంటుంది. ఇక ఈ అమ్మవారిని దర్శించినవారికీ ... అంకితభావంతో పూజించినవారికి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ వుంటారు. పర్వదినాల్లో ఆ తల్లికి చీరసారెలు సమర్పిస్తుంటారు. అమ్మవారికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70