ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవుడి మనసు ఇలా గెలుచుకున్నాడు !

Tue, May 13, 2014, 08:54 AM
Related Image తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గురించి తెలిసినవారికి 'అన్నమయ్య' గురించి తెలియకుండా వుండదు. ఆ స్వామిపట్ల మురిపెంతో ... ముచ్చటతో ఆయన రాసిన కీర్తనలు ఏడుకొండలు ఎక్కుతోన్న భక్తులకు వినిపించకుండా వుండవు. క్రీ.శ.1408వ సంవత్సరంలో వైశాఖ పౌర్ణమి రోజున జన్మించిన అన్నమయ్య, పదాలతో పరమాత్ముడి మనసును గెలుచుకోవచ్చునని నిరూపించాడు.

యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయన, వేంకటేశ్వరస్వామి నామానికి మించిన మంత్రం లేదనీ ... ఆయనకంటే ఘనమైన దైవం లేదని భావించాడు. స్వామివారిని సంకీర్తనలతో సేవిస్తూ తరించాలనే ఆరాటమే తప్ప ఆయనకి మరో ధ్యాస వుండేది కాదు. ఆయన తన కీర్తనల ద్వారా స్వామివారిని మురిపిస్తూ ... లాలిస్తూ ... ముద్దుచేస్తూ ముచ్చట తీర్చుకున్నాడు. స్వామివారిని మేల్కొలిపే కీర్తన నుంచి ఆయన పవళించేంత వరకు గల ప్రతి ఘట్టాన్ని తన కీర్తనల ద్వారా అత్యద్భుతంగా ఆవిష్కరించాడు.

ఈ నేపథ్యంలోనే లాలిపాటలు ... జోలపాటలు ... భక్తి ... శృంగార ... జ్ఞాన ... వైరాగ్య కీర్తనలు వెలుగుచూశాయి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేననీ, సూర్యుడి కిరణాలవలెనే ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై సమానంగా ప్రసరించబడతాయని తన కీర్తనల ద్వారానే తెలియజేశాడు. ఆలయ ప్రవేశం అందరికీ జరిగేలా కృషి చేశాడు. దేశీ రాగాలతో తెలుగు పద కవిత్వానికి ఆయన కొత్త సొగసులు అద్దడంతో, ఆయన కీర్తనలు అందరి నాల్కలపై ఆనందతాండవం చేయసాగాయి.

అందరి కష్టాలు వింటూ ... వాటిని తీరుస్తూ అలసిన స్వామి అన్నమయ్య కీర్తనలను ఆలకిస్తూ సేదతీరేవాడనడంలో అతిశయోక్తి లేదు. సమస్త జీవులను అనుగ్రహించి అలసిన ఆ స్వామిని మేల్కొలిపే సాహసం ఒక్క అన్నమయ్య పాటకు తప్ప మరి దేనికీ లేదు. ఆ స్వామి యొక్క మహాత్మ్యం గురించి ... మంచులా కరిగిపోయే ఆయన మనసు గురించి ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో అన్నమయ్య తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాడు.

భక్తులను తిరుమలకు రప్పించడం కోసం, తాను రాసిన కీర్తనలను ఆలపిస్తూ వివిధ ప్రాంతాలను దర్శించాడు. ఆయన పాటలకు పులకించని మనసులు కానీ ... తిరుమల కొండకు పరుగులు తీయని పాదాలు కాని లేకుండా పోయాయి. అలా అన్నమయ్య ఆ వేంకటేశ్వరుడిని ముప్పైరెండువేల సంకీర్తనలతో అభిషేకించి, ఆ స్వామి హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. భగవంతుడి మనసును గెలుచుకోవడమెలా అనేది భక్తులకు సూచించాడు.

అలాంటి అన్నమయ్యను ఆయన జయంతి రోజున స్మరించుకోవాలి. ఆయన రాసిన కీర్తనలను ఆలపిస్తూ ఆ శ్రీనివాసుడిని మరొక్కమారు అభిషేకించాలి. ఈ విధంగా చేయడం వలన మనసు పవిత్రమవుతుంది ... ఆ వేంకటేశ్వరుడి పాదపద్మాల చెంత సంతోషంగా సమర్పించబడుతుంది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118