ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గుడికి వెళితే ఎలా వుండాలి ?

Fri, Apr 18, 2014, 09:09 PM
Related Image దేవాలయం అనగానే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. పద్ధతిగా ... పరిశుభ్రంగా అక్కడికి వచ్చినప్పుడే ఆ పవిత్రత కాపాడబడుతూ వుంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడికి సమీపంగా వున్నామనే ఒక బలమైన భావనే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. దైవానికి చెప్పుకోవలసినవి చెప్పుకున్నాక మనసు తేలికపడుతుంది. తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు అక్కడ కూర్చుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది.

భగవంతుడు తమని ఈ స్థాయికి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక ముందు తమని నడిపించే నాయకుడు కూడా ఆయనేననే ఆలోచనతో ఇంటికి బయలుదేరితే ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇక కొంతమంది ధోరణి ఇలాంటి అనుభూతిని దూరంచేస్తూ వుంటుంది. వాళ్లు బయట ఎలా వ్యవహరిస్తూ ఉంటారో, ఆలయంలోను అలాగే ప్రవర్తిస్తుంటారు.

దైవ దర్శనం ... ప్రదక్షిణలు ... ప్రసాదాల సమయాల్లో ముందుకు తోసుకుపోతుంటారు. తమకి కలిగిన అసౌకర్యం గురించి ప్రశ్నిస్తే గొడవకి దిగుతుంటారు. దాంతో ఆలయ వాతావరణం దెబ్బతింటుంది. ఇలాంటి వాళ్లు ఆ క్షణంలోనే ఆ విషయాన్ని మరిచిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ సున్నితమైన మనసున్న భక్తులు మాత్రం తమ ప్రశాంతతకు భంగం కలిగినందుకు బాధపడుతూ అక్కడి నుంచి వెళతారు.

మరికొందరు భక్తులుగా ఆలయానికి వచ్చి కూర్చుని, ఆలయంలోని అర్చకుడి నుంచి వచ్చిపోయే మిగతా భక్తుల వరకూ అందరినీ విమర్శిస్తూ వుంటారు. ఆ విమర్శలు చెవినపడిన వాళ్లు వెంటనే గొడవకి సిద్ధపడతారు. ఫలితంగా ఆలయంలో యుద్ధవాతావరణం కనిపిస్తుంది. ఆలయమనేది ఎంత పవిత్రమైనదో, అక్కడి వాతావరణం అంతటి సున్నితమైనదని గ్రహించాలి. ఇతరుల ప్రశాంతతను భంగపరచడమంటే తాము ప్రశాంతతను కోల్పోవడమేననే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

దర్శనం కోసం ముందుకు తోసుకువెళ్లడం వలన భగవంతుడు ముందుగా అనుగ్రహించేది ఏమీ వుండదు. ఇక ఇతరులను తోసేస్తూ చేసేవి ప్రదక్షిణలుగా పరిగణించబడవు. ప్రసాదనేది భగవంతుడి అనుగ్రహంతో దక్కేది. దాని కోసం ఇతరులతో గొడవపడటం ... వారిని దూషించడం వలన పాపాలు మూటగట్టుకోవలసి వస్తుంది. ఆలయానికి వెళ్లి పుణ్యఫలంతో తిరిగి రావలసినదిపోయి, పాపాల భారంతో రావలసి వస్తుంది.

ఆలయంలో ఉన్నంత వరకూ దృష్టి ... మనసు భగవంతుడిపైనే వుండాలి. తమ ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకుంటూ సహనంతో వ్యవహరించాలి. ఇతరులపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినప్పుడే, ఆలయ దర్శనం వలన పరిపూర్ణమైన ఫలితం కలుగుతుంది. దైవ దర్శనం మంచిగా జరిగిందనే సంతృప్తి మిగులుతుంది.
X

Feedback Form

Your IP address: 54.161.168.87