ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పాతాళ గంగను పైకి తెచ్చిన స్వామి

Thu, Mar 13, 2014, 11:47 AM
Related Image తమిళనాడు ప్రాంతంలో ఆవిర్భవించిన కుమారస్వామి క్షేత్రాల్లో ఆరు క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఈ జాబితాలో తిరుప్పరం కున్రం ... పళని ... తిరుచ్చెందూర్ .. స్వామిమలై ... తిరుత్తణి ... పళముదిర్ చోళై క్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో 'తిరుప్పరం కున్రం' క్షేత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

దేవేంద్రుడి కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. సాధారణంగా కుమారస్వామి ప్రతి క్షేత్రంలోను నుంచుని దర్శనమిస్తూ ఉంటాడు. అందుకు భిన్నంగా ఈ ఒక్క క్షేత్రంలో స్వామివారు కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక ఈ ప్రధానమైన మూర్తికి కాకుండా శూలానికి అభిషేకాలు జరపడం కూడా ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు.

ఇంతటి పురాణ నేపథ్యం గల ఈ క్షేత్రంలో, మరో మహిమాన్వితమైన సంఘటన కూడా జరిగింది. ఈ క్షేత్రంలో గల గంగా తీర్థం ... స్వామివారు సృష్టించినదేనని చెబుతుంటారు. పూర్వం 'నక్కీరుడు' అనే భక్తుడు ఈ ప్రాంతంలో గల ఓ రాక్షసి బారినపడతాడు. ఆ రాక్షసి అతణ్ణి బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. స్వామి రక్షిస్తాడనే విశ్వాసంతో నక్కీరుడు ధైర్యంగా ఉంటాడు. ఆ రాక్షసి అతణ్ణి బలి ఇవ్వబోతుండగా కుమారస్వామి వచ్చి ఆ రాక్షసిని సంహరిస్తాడు.

తనని రాక్షసి తాకిన దోషం నుంచి బయటపడవేయవలసిందిగా నక్కీరుడు కోరడంతో, కుమారస్వామి తన శూలంతో నేలను తట్టగా అక్కడి పాతాళ గంగ పైకి వస్తుంది. ఆ జలధారల్లో స్నానమాచరించిన నక్కీరుడు, స్వామిని సేవించి తరించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆనాటి ఆనవాళ్లు ఈనాటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రానే సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247