ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చెరువు గట్టుపై చెన్నకేశవుడు

Tue, Feb 25, 2014, 10:25 AM
Related Image లోక కల్యాణం కోసం భగవంతుడు అనేక రూపాలతో ... అనేక నామాలతో ... వివిధ ప్రాంతాలలో ఆవిర్భవించాడు. భక్తులకి తన ఉనికిని తెలుపుతూ ... మిగతావారికి తన మహిమలు చాటుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అనేక ఆలయాలు నిర్మించబడుతూ ... ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా 'ఉల్లిపాలెం' తన ఘనతను చాటుకుంటోంది.

పవిత్ర కృష్ణానది పరివాహక ప్రాంతంలోగల ఉల్లిపాలెం గ్రామంలో పూర్వం శైవుడైన ఓ భక్తుడు వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. అందుకోసం ఆయన ఆలయాన్ని నిర్మించి ... వేణుగోపాలుడి విగ్రహాన్ని కూడా తయారుచేయిస్తాడు. అయితే అందులో శివలింగాన్నే ప్రతిష్ఠించాలని మిగతావాళ్లు పట్టుపడతారు. దాంతో ఈ వ్యవహారంలో ఆ ఊరు జమీందారు జోక్యం చేసుకుంటాడు. వివాదం తగ్గుముఖం పట్టిన తరువాత ఆలోచించవచ్చని వేణుగోపాలస్వామి విగ్రహాన్ని తన అధీనంలో ఉంచుతాడు.

ఆ రోజు రాత్రి ఆయనకు కలలో చెన్నకేశవస్వామి కనిపించి, తాను 'అల్లపర్రు'లో చెరువుగట్టుపై ఉన్నాననీ, ఉల్లిపాలెంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడట. మరునాడు ఉదయమే ఆ పక్కనే గల 'అల్లపర్రు' గ్రామానికి జమీందారు వెళతాడు. చాలాకాలం క్రితమే ఆ ఊళ్లో చెరువు తవ్వుతుండగా చెన్నకేశవస్వామి ప్రతిమ బయటపడిందనీ, దానిని గట్టునే ఉంచి పూజిస్తున్నారని తెలుసుకుంటాడు. ఆ రెండు గ్రామాల వారికి తన కలను గురించి చెప్పి, ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఉల్లిపాలెంలోని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు.

ఆ తరువాత ఇదే ప్రాంగణంలో వేణుగోపాలస్వామిని కూడా ప్రతిష్ఠిస్తాడు. కాలక్రమంలో ఇక్కడ శివ పార్వతులు కూడా కొలువుదీరడం జరిగింది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏడాది చెన్నకేశవస్వామికి కల్యాణోత్సవం నిర్వహించాక, స్వామివారిని అల్లపర్రు తీసుకుని వెళ్లి గ్రామోత్సవం జరపడం ఆనాటి నుంచి ఆనవాయతీగా వస్తోంది. ఈ గ్రామోత్సవంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సంతోషంగా పాల్గొంటారు ... హరిహరుల అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.87