ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అడిగినది ప్రసాదించే అమ్మవారి క్షేత్రం

Mon, Jan 27, 2014, 12:15 PM
Related Image అమ్మవారు ఎక్కడ ఆవిర్భవించినా అక్కడికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. అలా నిత్యం మహిళా భక్తుల రాకతో సందడిగా కనిపించే క్షేత్రం మహారాష్ట్ర - కేలాపూర్ లో దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారిని 'జగదాంబ' పేరుతో భక్తులు కొలుస్తుంటారు. అమ్మవారు స్వయంభువు మూర్తి అనీ ... ఏకవీరికా దేవి - తుల్జా భవాని అమ్మవారు కలిసి జగదాంబగా అవతరించారని స్థలపురాణం చెబుతుంది.

ఏకవీరికా అమ్మవారు గానీ ... తుల్జాభవాని అమ్మవారు గాని ఆదిశక్తి అవతారాలుగా చెప్పబడుతున్నారు. ఈ అమ్మవార్లు ఆవిర్భవించిన క్షేత్రాలు శక్తి పీఠాలుగా అలరారుతున్నాయి. అలాంటి అమ్మవార్ల ఏకరూపంగా ఆవిర్భవించిన జగదాంబని భక్తులు మహాశక్తిగా ఆరాధిస్తూ వుంటారు. వందల సంవత్సరాలుగా ఈ తల్లి ఎంతో మందికి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించిందని చెబుతారు.

గర్భాలయంలో అమ్మవారి మూర్తి పరిమాణం రీత్యా చిన్నదిగానే కనిపిస్తుంది. తలభాగం కాస్త పెద్దది గాను .. మిగతా అవయవాలు చిన్నవిగాను కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే ఈ అమ్మవారిని గ్రామదేవతగాను ఆరాధిస్తుంటారు. ప్రతి మంగళ - శుక్ర వారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దేవీ నవరాత్రుల సందర్భంగా .. వసంత పంచమి సందర్భంగా ఈ క్షేత్రంలో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. అమ్మవారికి తమ మనసులోని కోరికలను మనవి చేసుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారి గర్భాలయం కింద నుంచి చాలా పెద్ద సొరంగ మార్గం వుంది. ఈ సొరంగ మార్గం గురించిన ఆసక్తికరమైన కథనాలు అనేకం ఇక్కడ వినిపిస్తుంటాయి.

ఇక అన్నిటికంటే విశేషమేమిటంటే ... ఇక్కడి అమ్మవారి ప్రతిమ ఏడాది ఏడాదికి పెరుగుతూ వుందని అంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను సైతం చూపుతుంటారు. మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాద బలం వలన సకల శుభాలు చేకూరతాయి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137