ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాకరపాదులో కనిపించిన కృష్ణుడు

Fri, Jan 24, 2014, 01:06 PM
Related Image పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఆయా క్షేత్రాలు అక్కడ ఆవిర్భవించిన తీరును తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలా తెలుసుకున్నప్పుడు ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆసక్తిని ... ఆశ్చర్యాన్ని కలిగించే క్షేత్రంగా మనకి కృష్ణా జిల్లా 'హంసలదీవి' దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్నానమాచరించిన కాకి, తన శాపాన్ని పోగొట్టుకుని హంసలా మారినట్టు స్థల పురాణం చెబుతుంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి హంసలదీవి అనే పేరు వచ్చిందని అంటారు.

ఇదంతా వింటుంటేనే ఇది మహిమాన్వితమైన క్షేత్రమని తెలుస్తోంది. ఇక ఇక్కడి కృష్ణుడు 'కాకరపాదు' లో నుంచి బయటపడటం మరో విశేషంగా కనిపిస్తూ వుంటుంది. ఓ పశువుల కాపరి తన పశువులను మేపుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడ గల పుట్టలో తన ఆవులు పాలను ధారగా కురిపించడం చూస్తాడు. ఆ పుట్టలో పాము వుందని భావించి పుట్టపై మంటపెడతాడు. ఆ క్షణం నుంచి తన శరీరం కాలుతున్నట్టుగా అనిపిస్తూ ఉండటంతో ఆ పశువుల కాపరి బాధతో విలవిలలాడి పోసాగాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పుట్టపై మంటను తొలగించడంతో పశువుల కాపరి బతికి బయటపడతాడు. ఆ పుట్ట లోపల కృష్ణుడి విగ్రహం వుండటం చూసి వాళ్లు దానిని బయటికి తీయించగా అప్పటికే అది చాలావరకూ కాలిపోతుంది. జరిగిన దానికి అందరూ బాధపడతారు ... ఆ ప్రతిమను ప్రతిష్ఠించాలో .. మానుకోవాలో తెలియక ఆలోచనలో పడతారు. ఆ రాత్రి ఓ భక్తుడికి కలలో స్వామి కనిపించి, అక్కడికి సమీపంలో గల గ్రామం ( కాకరపర్తి)లో తాను ఉన్నట్టుగా చెప్పాడట.

ఆ ఊళ్లోని ఓ రైతు ఇంట్లో గల కాకరపాదు మొదట్లో తవ్వి చూస్తే తన విగ్రహం లభిస్తుందనీ, ఆ ప్రతిమను ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు. స్వామి చెప్పిన ఆనవాళ్లను బట్టి అలాగే చేయగా అక్కడ కృష్ణుడి విగ్రహం బయటపడుతుంది. కృష్ణుడి శరీర ఛాయలానే ఈ విగ్రహం నీల వర్ణంలో వుండటం అరుదైన విశేషంగా చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251