ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీ వరలక్ష్మీ వ్రతం

Tue, Jun 11, 2013, 09:23 AM
Related Image భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో 'నోములు - వ్రతాలు'అనేవి ప్రధానమైన పాత్రను పోషిస్తునాయని చెప్పవచ్చు. నోములు - వ్రతాలు జరపడంలో సంప్రదాయ బద్ధమైన పద్ధతుల్లో ప్రాంతాలను బట్టి కాస్త తేడాలు కనిపించినప్పటికీ, వాటి ద్వారా అందరూ ఆశించే ప్రయోజనం మాత్రం ఒక్కటే. స్త్రీలంతా కూడా తమ సౌభాగ్యాన్ని పది కాలాలపాటు పచ్చగా చూడమంటూ సుమంగళి అయిన పార్వతీ దేవి అనుగ్రహాన్ని కోరుతూ ప్రార్ధించడమే ఈ నోములు - వ్రతాల వెనుకగల పరమార్ధమని చెప్పొచ్చు.

సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని వారి తరఫున శివుడిని పార్వతీదేవి కోరినప్పుడు, ఆ ముక్కంటి చెప్పిన కథలుగా 'నోములు - వ్రతాలు ప్రచారంలోకి రావడం జరిగింది. ఇక ఈ నోములు - వ్రతాలను ఎక్కడ ... ఎప్పుడు ... ఏ సందర్భంలో చేయాలో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ నోములు - వ్రతాలు ఆచరించాలనేది కూడా పరమశివుడు పార్వతీ దేవికి సెలవిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. అలా స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో ముందుగా 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' గురించి తెలుసుకుందాం.



జీవితంలో అవసరాలు తీరాలన్నా ... ఆశలు నెరవేరాలన్నా అందుకు అవసరమైన సంపద కావాలి. సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన 'శ్రీ వరలక్ష్మీ దేవి' అనుగ్రహం ఉండాలి. అందుకోసం అందరికీ అందుబాటులో ఉన్న సులువైన మార్గం 'శ్రీ వరలక్ష్మీ వ్రతం'.

ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను ... కలశాన్ని ... పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన ... ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి ... అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.

అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి.

పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 'చారుమతి'అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది. నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు ... భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. 'శ్రావణ పౌర్ణమి'కి ముందు వచ్చు 'శుక్రవారం' తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది.

మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. 'శ్రావణ శుక్రవారం'రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి ... తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు.

అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు.

ఈ వ్రతం పూర్తి అయిన తరువాత మూడు సార్లు తీర్థం తీసుకుని మిగతావారికి ఇవ్వాలి. శక్తి మేరకు పేరంటాళ్లకు వాయనాలు ఇచ్చి పంపాలి. ఆ తరువాత ఉద్యాపన చేసుకోవాలి. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.8.87