ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భోగ భాగ్యాలనిచ్చే భోగి

Fri, Jan 10, 2014, 09:48 AM
Related Image తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను అందంగా ఆవిష్కరించే ప్రధానమైన పండుగలలో సంక్రాంతి ముందువరుసలో కనిపిస్తుంది. పెద్ద పండుగగా ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటోంది. రైతుల కష్టం ఫలించి వారి శ్రమ ఫలితం లక్ష్మీ స్వరూపంగా ఇళ్లకి చేరిన సందర్భంగా జరుపుకునే ఈ పెద్ద పండుగలో 'భోగి' ... 'సంక్రాంతి' ... 'కనుమ' తమ విశిష్టతను ఆవిష్కరిస్తూ వుంటాయి.

సంక్రాంతి పండుగ ముందు రోజున వచ్చే 'భోగి' విషయాన్నే తీసుకుంటే, 'భోగి' అనే మాటకు 'తొలిరోజు' అనే అర్థం చెప్పబడుతోంది. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి మరుసటి రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. భోగి రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. ఈ రోజున వైష్ణవ సంబంధిత ఆలయాల్లో శ్రీ గోదాదేవి రంగనాయకస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది.

ధనుర్మాస వ్రత దీక్షను చేపట్టిన గోదాదేవి, ఈ నెల రోజులలో ప్రతి రోజు స్వామివారి పట్ల తనకి కలిగిన భావాలను కవితా రూపంలో 'పాశురాలు' గా ఆవిష్కరించింది. అవే నేడు 'తిరుప్పావై' గా ప్రసిద్ధి చెందాయి. గోదాదేవి మధుర భక్తికి మెచ్చి ఆమెను స్వామి పరిణయమాడింది ఈ రోజునే. స్వామివారి సేవ ఆమెకి అంతటి భోగాలను కలిగించింది గనుకనే ఈ రోజుకి 'భోగి' అనే పేరు వచ్చిందని అంటారు.

ఇక వామనావతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కినది ఈ రోజునే. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకునే మంటలు వేయడం జరుగుతుందని చెబుతారు. శ్రీ మహా విష్ణువుకు 'రేగు పండ్లు' అంటే ఎంతో ఇష్టమని చెప్పబడుతోంది. ఆయనకి అంతటి ప్రీతికరమైన రేగుపండ్లను చిన్న పిల్లల తలపై నుంచి పోయడం వలన ఆయన ఆశీస్సులు అమితంగా లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

భోగి రోజున జరిగే ఈ వేడుకలో రేగుపండ్లు ... భోగి పండ్లుగా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఇక వీటితో పాటు చెరుకు ముక్కలు ... నానబెట్టిన శనగలు ... చిల్లర డబ్బులు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ వేడుక వలన చిన్న పిల్లలపై ప్రభావం చూపే గ్రహ సంబంధమైన ... దృష్టి సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే భోగి మంటల పేరుతో పనికి రాని వస్తువులను కాల్చేయడం వలన అనవసరమైన వస్తువులను ఆశ్రయించే వుండే అనేక రకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి.

ఇక పాడి పంటలు భగవంతుడు ప్రసాదించినవి గనుక, ఆయన ఇచ్చిన వాటితో నైవేద్యాలు వండి కృతజ్ఞతా పూర్వకంగా ముందుగా ఆయనకి సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించడం ఈ భోగి రోజున జరుగుతుంది. ఓ వైపున ఆధ్యాత్మిక చింతన ... మరోవైపున ఆరోగ్య సంబంధిత ఆచారం భోగి పండుగలో అంతర్లీనంగా కనిపిస్తుంటాయి. ఇటు ఆయురారోగ్యలను ... అటు భోగ భాగ్యలను అందిస్తుంది కనుకనే ఈ పండుగ 'భోగి' పేరుతో ఇంటింటా సంతోషాల సందడి చేస్తోంది ... ఆనందాల విందులు చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99