ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బతుకమ్మ

Sat, Jun 08, 2013, 05:49 PM
Related Image భారతీయుల ఆధ్యాత్మిక వైభవానికీ ... సంస్కృతీ సంప్రదాయాలకు శ్రావణ - భాద్రపద - ఆశ్వీయుజ - కార్తీక మాసాలు అద్దం పడుతుంటాయి. అలాంటి పవిత్రమైన మాసాల్లో ఒకటైన భాద్రపద మాసంలో అమావాస్య నుంచి ఆశ్వీయుజ శుద్ధ దశమి వరకూ జరిగే పండుగ - బతుకమ్మ పండుగ. తెలంగాణా ప్రాంత ప్రజలు ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటూ వుంటారు. కన్నెపిల్లలు ... వివాహిత స్త్రీలు బతుకమ్మల తయారీలో ఉత్సాహంగా పాల్గొంటూ వుంటారు.

ఈ పండుగ రోజుల్లో పల్లె - పట్నం అనే తేడా లేకుండా ఆడ పిల్లలంతా ఉదయాన్నే నిద్రలేచి ఆ పరిసర ప్రాంతాల్లో దొరికే పూల వేటలో పడతారు. ఈ కాలంలో ఎక్కువగా తంగేడు పూలు ... గడ్డిపూలు విరివిగా వుంటాయి కాబట్టి వాటిని సంపాదిస్తారు. అమావాస్య రోజున ఎంగిలి పూవులతో మొదలు పెట్టి అష్టమి నాటికి 'సద్దుల బతుకమ్మ'ను ... చివరి రోజున 'గౌరమ్మ'ను తయారు చేస్తారు.

''ఒక్కొక్క పువ్వేసి చందమామ '' అంటూ జానపద గీతాలను శ్రమ తెలియకుండా పాడుకుంటూ, ఒక పళ్లెంలో వరసల వారీగా రకరకాల ... రంగురంగుల పూవులను పేరుస్తారు. తాము తయారు చేసిన బతుకమ్మను భక్తితో తలపై పెట్టుకుని ఊరేగుతూ, ఊరు మధ్యలోగానీ ... దేవాలయం దగ్గరగాని బతుకమ్మను వుంచి '' బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ... బతుకు నాగమ్మ ఉయ్యాలో''అంటూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ లయబద్దంగా గుండ్రంగా తిరుగుతూ పాడుతూ వుంటారు.

ఇక చివరి రోజున అందంగా అలంకరించిన బతుకమ్మపై పసుపు ముద్దతో చేసిన గౌరమ్మను వుంచి ధూప దీప నైవేద్యాలు చూపిస్తారు.'గౌరీ కల్యాణం ' ... 'కాంభోజరాజు కథ' ... 'బాలనాగమ్మ' తదితర కథలకి సంబంధించిన పాటలు పాడుతూ ... వాటికి తగిన విధంగా లయబద్ధంగా నాట్యం చేస్తూ జలాశయాల దగ్గరికి చేరుకుంటారు. బతుకమ్మకు భక్తి శ్రద్ధలతో హారతి ఇచ్చి '' పోయి రావమ్మా గౌరమ్మ ... పోయి రావమ్మా మా బంగారు బతుకమ్మా '' అంటూ ఆ పూల గుమ్మటాన్ని జలాశయంలోకి వదులుతారు.

పార్వతీ ప్రకృతి మాత ... ఆ సర్వమంగళ ఇచ్చిన పూవులతో ఆమెని అలంకరించి, కడవరకూ తమ సౌభాగ్యాన్ని కాపాడమని స్త్రీలంతా కోరుతుంటారు. గౌరీదేవిని లింగాకారంలో పూలతో పేర్చి గంగలో వదలడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ విధంగా చేయడం వలన గంగా ... గౌరీ సమేతుడైన శివుడిని పూజించిన ఫలితం దక్కుతుంది. తొమ్మిది రోజులపాటు ... తొమ్మిది రకాల పువ్వులతో జరిపే ఈ పండుగ, అమ్మవారి నవ రూపాలకు ప్రతీకయని ... నవవిధ భక్తికి నిదర్శనమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117